చుక్కా రామయ్య
చుక్కా రామయ్య | |
---|---|
జననం | చుక్కా రామయ్య 1925 నవంబరు 20[1] వరంగల్ జిల్లా, గూడూరు గ్రామం |
ఇతర పేర్లు | ఐ.ఐ.టి రామయ్య |
వృత్తి | ఐఐటీ శిక్షకులు, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసన మండలి సభ్యులు |
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి |
తల్లిదండ్రులు |
|
చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు.[2][3] జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది.
బాల్యం, విద్య, ఉద్యోగం
[మార్చు]ఇతను 1925, నవంబర్ 20 న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు.రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు.
జనగామ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.
ఐఐటి రామయ్య
[మార్చు]నాగార్జున పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఇతను ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58 ఏళ్ళకు పదవీ విరమణ చేయవలసి ఉండగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 1983లో ముందస్తు పదవీ విరమణ చేశాడు.దాంతో అతనికి ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను, ఇతర ఫలాలు రాలేదు. దీనివలన జీవనభృతికి మార్గాలు చూసుకొనవలసి వచ్చింది.
నిర్మల్ జిల్లా, బాసర లోని సరస్వతి ఆలయానికి వెళ్ళి భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రయివేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. విరమణానంతరం సాధించిన తన విజయాలను అతని బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తాడు.
అతని కుమార్తె ఐఐటికి ఎంపికైంది. అడ్మిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపికైన వారిలో తెలుగువారు చాలా తక్కువగా ఉంటున్నారని గ్రహించిన రామయ్య తనే తెలుగు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాదు, నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితం బోధించడం మొదలుపెట్టాడు. మొదటి బృందంలో ఎనిమిది మందిలో ఎవరూ ఎంపిక కాలేదు. అయినా నిరాశ పడక ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో చాలా ప్రఖ్యాతి పొందాడు. ఆరకంగా చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందాడు.
భారత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐఐటిని మంజూరు చేసినపుడు చుక్కా రామయ్య దాన్ని బాసరలో స్థాపించాలని కోరి దానికై తీవ్ర ప్రయత్నం చేసాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని హైదరాబాదులో నెలకొల్పింది.
ఇతర వ్యాపకాలు
[మార్చు]విద్యా విషయకంగా రామయ్య అనేక పుస్తకాలను రచించాడు. 2007 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తూ ఉద్యమించాడు.
రచనలు
[మార్చు]
|
|
సూచికలు
[మార్చు]- ↑ Sanchari, Pal (23 November 2017). "Chukka Ramaiah, The Man Who Made IIT Exam Accessible to Hundreds of Students". The Better India. Retrieved 29 June 2018.
- ↑ Bhandaram, Vishnupriya (5 April 2012). "Social activism and algebra". The Hindu. Retrieved 29 June 2018.
- ↑ "మా కుటుంబాన్ని వెలివేశారు". eenadu.net. ఈనాడు. 28 June 2018. Archived from the original on 28 జూన్ 2018. Retrieved 28 జూన్ 2018.
యితర లింకులు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- 1925 జననాలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు రచయితలు
- మహబూబాబాదు జిల్లా విద్యావేత్తలు
- మహబూబాబాదు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
- మహబూబాబాదు జిల్లా రచయితలు
- చేసిన పని వలన పేరు మారిన తెలంగాణ వ్యక్తులు
- మహబూబాబాదు జిల్లా ఉపాధ్యాయులు